Saturday, 24 March 2018

అస్తమించిన సూర్యుడు @ శృంగవరపు రచన

అస్తమించిన సూర్యుడు
@ శృంగవరపు రచన 

ఇష్టం-అయిష్టం అన్నవి లేవు జీవితమున ....
ప్రవృత్తి -ప్రవృత్తి చిరుదరహాసాలు చిందించవు చేరువ చెంతన...
నా జీవితం-నా తోవ అన్న మాటలెప్పుడో అంతరించె
జీతమెంత అని అడిగేవారే కానీ ...
ఆత్మ జ్యోతి నిన్నెందుకు వీడింది అని ఆదుర్దాపడ్డవారే లేరే!
ఆరడుగుల దేహంలో అణువణువున ప్రేమతో నర్తించే...
ఆ చిట్టి హృదయ స్పందన నేడు చిన్నబోయిందే!!
కాసులతో ఉదయం ఊగినప్పుడు తందానా అన్నవారు...
బాలభానుడి స్పర్శతో సాపాటు గడుపుకున్నవారు..
తూర్పు నుండి పడమర మళ్ళగానే శని లా చూస్తారే ?
నాయకుడి తేజస్సు తగ్గినా కురువృద్ధుడు కాలేదే...
నాయకి హోయలు క్షీణించినా దాసి అవ్వలేదే ....
నాంది వచనం ఇంకా భరతవాక్యం కాలేదే!!
నాటి లక్ష్మీ కటాక్ష పిల్లన గ్రోవి నేడు పనికిరాని కర్రముక్కయ్యిందా?
నాటి కామధేనువు నేడు వట్టిపోయిందా??
చరమాంకంలోని చర్మం అశ్రుకణాలనే కానీ...
సొమ్ముల వర్షాన్ని కురిపించలేదనేగా ఆ కినుక?
మనుషుల రాత మొదలయ్యేది ముగిసేది...
నగదు నర్తింపు తోనే కానీ నలిగిపోయే మనసుల వ్యధలో కాదు!
అస్తమించే సూర్యుడు ఆకాశంలో తప్ప
భూమిపై ఎప్పటికీ ఉదయించడు!!

No comments:

Post a Comment

MOST VIEWED (All time)